సుస్వాగతం

మానవసేవే మాధవసేవ అనేది ఈ బ్లాగ్ కి స్ఫూర్తి


చేసిన పాపం చెబితే పోతుంది అంటారు పెద్దలు. చేసిన పుణ్యమూ అంతే... చెప్పుకుంటే పోతుంది,

కాని మనం చేసిన ఒక మంచి పని నలుగురికీ స్ఫూర్తిని ఇస్తుందంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో తప్పేమి ఉంటుంది.

అలా మనం చేసిన కొన్ని మంచి పనులని అందరికీ తెలియచేసి కొందరికైనా స్ఫూర్తినివ్వాలనే ఈ బ్లాగ్ ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం.


దీనికోసం:


1)మీరొక పని మీద వేరొక ఊరు వచ్చి మండుటెండ లో ఒక హొటల్ నుండి భోజనం చేసి బయటకి వచ్చారు. అక్కడ ఒక ముదుసలి అవ్వ ఆకలితో మాడిపోతూ డబ్బుల కోసం అన్నం తినడానికి అడుక్కుంటోంది. ఆమెకు అన్నం పెట్టించండి, లేదా కనీసం టిఫిన్ ఐనా పెట్టించండి. ఆమె కళ్ళలో కృతజ్ఞతను చూడండి. మీ గుండె మీకేమి చెబుతుందో వినండి. ఆమె మీకెపుడూ ఆకలి కష్టం రాకూడదని తన నిండు మనసుతో దేవుడిని ప్రార్ధిస్తుంది.


2)మీకెప్పుడు కష్టమొచ్చినా దేవుడికి డబ్బులేస్తే మీ సమస్య తీరుతుందనుకోండి, కాని ఈసారి వెరైటీగా నాకీ సమస్య తీరితే ఒకరికి సాయం చేస్తా అని మొక్కుకోండి. తప్పకుండా మీ సమస్య తీరుతుంది.


3)మీ అదృష్టం బాగుండి మీరొక మంచి స్దితిలో ఉన్నారు, కాని ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అనుకోకండి. మనం ఒక పేదింటి బిడ్డకి సాయం చేస్తే రేపూ మన పిల్లలకి ఆపద వచ్చినప్పుడు అంతకు పది రెట్లుగా వేరెవరివల్లో సాయమందుతుంది.


4)జీవితంలో మీరెప్పుడో ఒకప్పుడు కనీసం ఎవరో ఒకరి సాయమైనా తీసుకోకుండా ఒక మంచి స్దితికి వచ్చి ఉండరు, ఒకసారి కళ్ళు మూసుకుని గుర్తుకు తెచ్చుకోండి. అలానే మీరూ చేతనైనంత సహాయం, తోడ్పాటు మీ నుండి అవసరమైన వారికి ఇవ్వండి. వారి జీవితంలో వెలుగు మీ గుండెల వరకూ పరుచుకుంటుంది.


5)మనం మన నెలవారీ ఖర్చుల కోసం ఒక బడ్జెట్ వేసుకుంటాము. అందులో కనీసం మన జీతంలో ఒక పర్సెంటైనా ఇతరుల కోసం దానానికి లేదా సాయానికి పక్కన పెట్టలేమా? మీరు 10,000 రూ. సంపాదిస్తున్నారు అనుకుందాము నెలకు. అంటే 100 రూ. ఎవరికైనా సాయం చెయ్యడానికి పక్కన పెడితే మీకు కష్టమౌతుందా?


6)ఒకరి ఆపరేషన్ కోసం లక్ష రూపాయిలు ఖర్చు అవుతుంది అనుకుందాము, అంతసాయం చెయ్యడం మీ స్దొమత వలన అవ్వదు. ఆగిపోకండి నావలన కాదని. ఒక వెయ్యి రూపాయిలు ఐతే మీకివ్వడానికి ఓకె అనుకోండి, మీరు అంతే ఇవ్వండి. కాని నలుగురికీ చెప్పి మిగిలిన ఎంతో కొంత ఇవ్వగలిగేలా చెయ్యండి. మీరివ్వలేకపోయినా మిగిలిన మీకందుబాటులో ఉన్నవారికి చెప్పండి. వారు తోడ్పడినా వారి పుణ్యంలో మీకూ భాగముంటుంది.


7)మీరు మీ ఊరు వచ్చినప్పుడు మీకు స్దోమత కలిగితే ఒక బాగా చదివే పేద విద్యార్ధి(ని)కి చదువుకోడానికి ఆర్ధికసాయం చెయ్యండి, చదువు చెప్పిస్తే జీవితాన్నిచ్చినట్టే.


8)మనకి కష్టం వచ్చినప్పుడు అనుకుంటాము దేవుడికైతే ఇంచక్కా కష్టాలు ఉండవుకదా అని. మీకూ దేవుడు అవ్వాలని ఉందా, కనీసం ఒకరితో ఐనా నిండు మనసుతో 'దేవుడిలా వచ్చి సాయం చేసావు' అనుపించుకోండి. మీరూ దేవుడు అయ్యారు కదా మీకూ కష్టాలు ఉండవు.


9)ఆఖరిగా మీకు కష్టమొచ్చి దేవుడి దగ్గరకు వెళ్ళి కష్టం నుండి గట్టెక్కించమని అడిగితే, ఇప్పటివరకూ నీ జీవితంలో నువ్వెవ్వరికైనా నిండు మనసుతో సహాయం చేసావా అని దేవుడు మిమ్మల్ని అడిగితే, మీ సమస్య దేవుడు తీర్చెంతగా మీ దగ్గర కనీసం ఒక బలమైన పుణ్యఫలం ఉందా?


అలా ఉంటే...

meespoorti@gmail.com

మీరు చేసిన ఆ మంచి పనులను పైన తెలియచేసిన మెయిల్-ఐడికి దయచేసి పంపండి. మా టీమ్ నిర్ణయించి ఈ బ్లాగ్ లో ఉంచుతాము. ఈ బ్లాగ్ దీనికి సంబంధించిన యాహూ గ్రూప్స్ కి, అందరి స్నేహితులకి తెలియచేయబడుతుంది. మీరు చేసిన మంచి పని కొందరికైనా స్ఫూర్తిగా నిలుస్తుంది.

Saturday, September 1, 2007

మా రమణమూర్తి ఔదార్యం - ఒక యువకుడికి మలేషియా జైలు విముక్తి


ఈ ఫోటోలో కనిపించేది మా మంచి రమణమూర్తి. వీడు అస్తమానూ ఇతరులకి సహాయం చేసే గొడవలలో తలదూరుస్తూంటాడు. వీడు ప్రస్తుతం ఉండేది కౌలాలంపూర్, మలేషియాలో. వీడు చేసిన అతి మంచి పనులలో ఒకటి నాకు నచ్చినది చెబుతాను. కొద్ది రోజుల ముందు తూర్పు గోదావరికి చెందిన ఒక యువకుడు పేరు రాజు ఇక్కడ కౌలాలంపూర్లో ఒకరితో అనవసరమైన గొడవపడి పోలీసులకి దొరికిపోయాడు. అతని దురదృష్టం అతను ఇల్లీగల్. అంటే అతని వీసా పేపర్లు సరైనవి కాదు. అతన్ని జైలులో పెట్టారు. ఈ మలేషియా జైళ్ళు నరక కూపాలు. 150 మందిని ఒకే సెల్లో ఉంచుతారు. వీళ్ళందరికీ ఒకే బాత్రూమ్-కం-లెట్రిన్ ఉంటుంది. అదెంత నరకమో ఆలోచించండి. ఇక ఆహారం సంగతి సరేసరి, దారుణమైన అన్నం పెడ్తారు. ఇది ఇండియాలో ఉన్న ఆ అబ్బాయి నాన్నగారికి తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఆ తల్లితండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ అబ్బాయి నాన్నగారు ఎలాగోలా వాళ్ళ పక్క ఊరికి చెందిన మా రమణమూర్తి మలేషియాలో ఉంటున్నట్టు తెలుసుకుని వీడి ఫోన్ నెం. సంపాదించి వీడికి ఫోన్ చేసి వివరాలు చెప్పి పుత్రభిక్ష పెట్టమని కన్నీరు మున్నీరుగా విలపించి విడిపించడానికి అయిన ఖర్చులంతా భరిస్తానని చెప్పారు. వాళ్ళకి తప్పకుండా ఆ అబ్బాయిని విడిపించి ఇండియాకు పంపుతానని మాట ఇచ్చి భయపడవద్దని ధైర్యం చెప్పాడు. కాని వీడికీ కొత్తనే, ఇలాంటి కేసులను ఎలా విడిపించాలో. ముందు ఆ అబ్బాయి ఎడ్రస్సు తెలుసుకుని, అతను చేసిన తప్పు తెలుసుకుని ఎలా ప్రొసీడ్ కావాలో మా స్నేహితులని అందర్నీ కనుక్కుని విడిపించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కొన్నిసార్లు ఆఫీసు సెలవు పెట్టి, కొన్నిసార్లు పర్మిషను పెట్టి ఆ రాజు అన్న అబ్బాయిని జైలులో కలసి అతనికి కావలసినవి కొని, తినడానికి కొని, అవసరమైనప్పుడు అతని సంతకాలు తీసుకుని పేపర్లు సబ్మిట్ చేసి కొద్దిరోజులకి అతన్ని ఇండియాకు పంపడానికి పర్మిషన్ తేవడంలో సఫలీకృతుడయ్యాడు. దీనికంతటికీ సుమారు నెల రోజులపైగా పట్టింది. ఈ నెల రోజులూ మా రమణమూర్తి ఓపిగ్గా అవసరమైనచోట్లకి, జైలుకి తిరిగాడు. పర్మిషన్ రాగానే ఇండియాకు టికెట్ తీసి జైలుకు తీసుకు వెళ్ళి ఇస్తే ఆనక వాళ్ళు అతన్ని కస్టడిలో ముందు ఎయిర్పోర్టుకు తర్వాత ఇండియాకు పంపారు. ఆ అబ్బాయి ఇండియా చేరాక వాళ్ళ ఇంట్లో పండగే పండగ. మేమంతా మా రమణమూర్తిని మెచ్చుకున్నాము.

3 comments:

విహారి(KBL) said...

మీ బ్లాగు చాలా బాగుందండి.
మీ బ్లాగు కూడలి,తేనెగూడు లొ కలపండి.ఎక్కువమంది చదువుతారు.

mohanraokotari said...

ramana murthi gaaru chala manchi vaarandi, meelanti vaare maalanti endariko inspiraration, meeku aa bagavanthudu anni sama kurchu gaka, spandana ku abhinandanalu.

lakshmi said...

mee spoorti spoortidayakamga undi.elage continue cheyyandi.gods blessings are always with you.